February 28th, 2010 at 5:17 pm
పూరీలు అంటే అందరికి తెలిసిందే. కాని ఇదే పూరీలను ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. అందులో చాలా సులువైనది, పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడే మసాలాపూరీలు ఎలా చేయాలో చూద్దాం. ఇవి చాలా తక్కువ సమయంలో తయారుచేసుకోవచ్చు.

కావలసిన వస్తువులు :
గోధుమ పిండి – 2 కప్పులు / 200 gms
సెనగ పిండి – 1 కప్పు /100 gms
కరివేపాకు – 3 రెబ్బలు
పసుపు – 1/4 tsp
కారం పొడి – 1 tsp
గరం మసాలా పొడి – 1 tsp
ఉప్పు – తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 tbsp
నూనె – వేయించడానికి
గోధుమపిండి, సెనగపిండి, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు, కొద్దిగా నీళ్లు కలిపిన అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన కరివేపాకు వేసి బాగా కలియబెట్టి, కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ పూరీపిండిలా తడిపి పెట్టుకోవాలి. పిండి మరీ గట్టిగా కాని, మరీ పలుచగా కాని ఉండకూడదు. మధ్యస్థంగా , మృదువుగా ఉండాలి. ఈ పిండిపై చెంచాడు నూనె వేసి మూతపెట్టి ఉంచాలి. అరగంట తర్వాత పిండిని మళ్లీ మర్దనా చేసి మృదువుగా అయ్యాక చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. తర్వాత ఈ ఉంఢలను పలుచగా పూరీల్లా వత్తుకొని వేడి నూనెలో రెండువైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఇవి కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. నాలుగు రోజులు నిలవ కూడా ఉంటాయి. పూరీలు కాస్త లావుగా వత్తుకుంటే మెత్తగా వస్తాయి. పలుచగా వత్తుకుంటే కరకరలాడుతూ ఉంటాయి. మీకు ఇష్టమైన రీతిలో చేసుకోవచ్చు. సాదా పూరీలకంటే అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే బావుంటుంది కదా..
Read this post in English :
Tags:
పూరీలు,
స్నాక్స్
February 24th, 2010 at 5:53 pm
హైదరాబాదీ స్పెషల్స్ అంటే ఘాటుగా ఉంటాయి. అందులో బిరియానీ, మిర్చి కా సాలన్, దాల్చా మొదలైనవి చాలా ప్రసిద్ధి పొందినవి. బిరియానీకి తప్పకుండా జత చేయాల్సిన కూర బజ్జీ మిరపకాయలతో చేసేది . అదే మిర్చి కా సాలన్. ఈ కూర ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావలసిన వస్తువులు :
మిరపకాయలు – 250 gms
చింతపండు పులుసు – 1/4 కప్పు
పసుపు – 1/4 tsp
కారం పొడి – 1 tsp
ఉప్పు – తగినంత
కొబ్బరి పొడి – 3 tbsp
జీలకర్ర పొడి – 1/2 tsp
మెంతి పొడి – 1/4 tsp
పల్లీల పొడి – 2 tbsp
నువ్వుల పొడి – 2 tbsp
ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు – 2 tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 tsp
జీలకర్ర – 1/4 tsp
గరం మసాలా పొడి – 1 tsp
మెంతులు – చిటికెడు
నూనె – 4 tbsp
ఈ కూర కోసం బజ్జీ మిరపకాయలను వాడాలి. రుచి బావుంటుంది. మిరపకాయలను మధ్యలో చాకుతో కాటు పెట్టి గింజలు తీసేయాలి. ఇలా చేయడం వల్ల మిరపకాయలలో కారం తగ్గుతుంది. ప్యాన్ లో నూనె వేడి చేసి మిరపకాయలను కొద్దిగా మెత్తబడేవరకు వేయించాలి . ఒక గిన్నెలో చింతపండు పులుసు, వేయించిన ఉల్లిపాయలు,అల్లం వెల్లుల్లి పేస్ట్, కారంపొడి, కొబ్బరి పొడి, పసుపు, ఉప్పు, పల్లీలపొడి, నువ్వుల పొడి, జీలకర్ర , మెంతిపొడి వేసి బాగా కలిపి ఉంచాలి. ఇందాక మిరపకాయలు వేయించిన ప్యాన్ లోనే నూనె వేడి చేసి జీలకర్ర, మెంతులు వేసి ఎర్రబడ్డాక పొడులన్నీ కలిపిన చింతపండు పులుసు కప్పుడు నీళ్లు పోసి నిదానంగా మరిగించాలి. పులుసు, పొడులు ఉడికి కమ్మటి వాసన వస్తుండగా వేయించిన మిరపకాయలు, గరం మసాలా పొడి వేసి మరో ఐదునిమిషాలు మసాలాలో ఉడకనిచ్చి నూనె తేలగానే దింపేయాలి. కమ్మటి , ఘాటైన మిర్చి కా సాలన తయారైంది. ఈజీగా ఉంది కదా.. ఈ కూర బిరియాని. వెజ్ ఫ్రైడ్ రైస్, పులావ్ లకు, రొట్టెలకు కూడా బావుంటుంది.
Read this post in English:
Tags:
కూరలు,
మిర్చి కా సాలన్,
మొఘలాయి స్పెషల్
February 21st, 2010 at 3:46 pm

తెలుగువారింట పచ్చడిలేని రోజుండదుగాక ఉండదు. ఎన్ని కూరలున్నా, ఏదో ఒక పచ్చడి ఉండాల్సిందే. ఇక వేసవి వచ్చిందంటే నిలవ పచ్చళ్ల సంరంభం మొదలవుతుంది. కొరివికారం లేదా పండుమిరపకాయ పచ్చడి అంటే ఇష్డంలేనిది ఎవ్వరికి? కొరివికారం అంటే వినడానికి, చూడడానికి భయమేసినా, తింటే మాత్రం మళ్లీ వదలరు.

కావలసిన వస్తువులు:
పండు మిరపకాయలు – 1 kg
చింతపండు – 200 gms
ఉప్పు – 250 gms
పసుపు – 50 gms
జీలకర్ర పొడి – 1 tbsp
మెంతి పొడి – 1 tsp
ఆవాలు – 1 tsp
జీలకర్ర – 1 tsp
కరివేపాకు – 3 రెబ్బలు
నూనె – 200 gms

ముందుగా మిరపకాయలను గుడ్డతో తడి లేకుండా తుడవాలి. నీళ్లతో కడగొద్దు. ఈ పచ్చడి చేసేటప్పుడు తడి అస్సలు తగలకూడదు. చింతపండులో నార, గింజలు లేకుండా శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. మిరపకాయలను చిన్న ముక్కలుగా చేసుకొని ఉప్పు, పసుపు, చింతపండు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా బరకగా ఉంటే చాలు. దీనిని తీసి ఒక జాడీలో వేసి పెట్టుకోవాలి. మూడు రోజుల తర్వాత మళ్లీ ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు కావలసినంత పచ్చడి తీసి దానికి సరిపడా జీలకర్ర పొడి, మెంతి పొడి కలిపి, మళ్లీ మెత్తగా రుబ్బుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టుకుంటే చాలు. రుచికరమైన పండుమిరపకాయ పచ్చడి తయారు. కావాలంటే వెంటనే మొత్తం పచ్చడి రుబ్బుకొని , జీలకర్ర పొడి, మెంతిపొడి కలిపి పోపు పెట్టుకోవచ్చు. కాని ఎప్పటికప్పుడు చేసుకుంటే తాజాగా మరింత రుచిగా ఉంటుంది . ఈ పచ్చడి తడి తగలకుండా, ఉప్పు సరిగ్గా కొలతతో వేసి రుబ్బుకుంటే ఏడాది వరకు నిలవ ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కొరివికారం, కాసింత నూనె లేదా నెయ్యి వేసి కలుపుకుని తింటే ఏ చికెన్, మటన్ కూడా పనికిరాదు..
Read this post in English:
Tags:
కొరివికారం,
పచ్చడి
February 15th, 2010 at 5:12 pm
స్నాక్స్ లో ఇప్పుడు ప్రతి ప్రాంతంవారి వంటకాలు ప్రసిద్ధమవుతున్నాయి. చాలామంది వీటిని రుచి చూసి భేషో అంటున్నారు. ఈ గుజరాతీ, మార్వాడీ స్నాక్స్ లో సమోసా, కచోరీ, పానీపూరీ వగైరా. ఇవాళ కచోరీ చేయడమెలాగో చూద్దాం. ఎక్కువగా బయట కొనుక్కుని తినడమే అలవాటు. ఇంట్లో చేయడం మనకు కుదరదులే అనుకుంటాము. కాని ఇది చాలా సులువు.

కావలసిన వస్తువులు:
పెసరపప్పు – 1/2 cup
జీలకర్ర – 1 tsp
ఇంగువ – a pinch
పచ్చిమిరప, అల్లం ముద్ద – 1 tsp
సోంపు – 1 tsp
గరం మసాలా పొడి – 1/2 tsp
కారం పొడి – 1/2 tsp
ఎండు మామిడి పొడి / ఆమ్చూర్ పొడి – 1 tsp
మైదా – 2 cups
నెయ్యి లేదా డాల్డా లేదా నూనె – 1/4 cup
ఉప్పు – తగినంత
నూనె – వేయించడానికి
మైదా లో చిటికెడు ఉప్పు వేసి కలిపి నెయ్యి లేదా డాల్డా కరిగించి వేయాలి. మొత్తం పిండిని నెయ్యి కలిసి బ్రెడ్ పొడిలా అయ్యేదాక బాగా కలపాలి. తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ముద్దలా చేసుకోవాలి. ఈ పిండి ముద్ద మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండాలి. ఈ పిండిని తడిగుడ్డ కప్పిఅరగంట అలా ఉంచాలి.
పెసరపప్పును శుభ్రం చేసి నీళ్లు పోసి రెండుగంటలు నానబెట్టాలి. తరవాత నీరంతా ఒడ్చి తడి పోయిన తర్వాత గ్రైండర్ లో బరకగా (ఇడ్లీ రవ్వలా) పట్టుకోవాలి. వెడల్పాటి ప్యాన్ లో ఒక చెంచాడు నూనె వేడి చేసి ఇంగువ, జీలకర్ర వేయాలి. జీలకర్ర చిటపటలాడాక గ్రైండ్ చేసుకున్న పప్పును వేసి నిదానంగా తడి పోయేవరకు వేయించాలి. పప్పు కాస్త ఎర్రబఢేవరకు మరో పది నిమిషాలు వేయించాలి. ఇప్పుడు మిగతా మసాలాలు ( కారం పొడి, ఆమ్చూర్ పొడి, సోంపు, పచ్చిమిర్చి అల్లం ముద్ద, గరం మసాలా పొడి) వేసి బాగా కలియబెట్టాలి. తగినంత ఉప్పు కూడా వేసి మొత్తం మిశ్రమం తడిలేకుండా ఉండేలా మరో పదినిమిషాలు వేయించాలి.
మైదాను మృదువుగా అయ్యేలా బాగా మర్దించాలి. దీనికి కొద్దిగా బలం చూపించాలి తప్పదు. పెద్ద నిమ్మకాయంత ముద్దలు చేసుకోవాలి. ఒక ముద్ద అరచేతిలోకి తీసుకొని వెడల్పుగా చేసి మధ్యలో పెద్ద చెంచాడు వేయించి పెట్టుకున్న పెసరపప్పు మిశ్లమాన్ని పెట్టి అన్నివైపులా అంచులని మధ్యలోకి తెచ్చి, మూసేసి గుండ్రని ముద్ద చేసుకోవాలి. ఇలా అన్ని ముద్దలతో చేసి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసుకోవాలి. అరచేతిలోకి తీసుకొని కొద్దిగా వెడల్పుగా , సమానంగా తట్టి వేడి నూనెలో వేయాలి. నిదానంగా బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. అప్పుడే కచోరి లోపలివరకు కాలి, పొరలు పొరలుగా ఉంటుంది. అలాగే కచోరీలను చేత్తోనే చేయాలి. రెండువైపులా వేగిన కచోరీలను టమాటా సాస్ , ఉడికించి కొద్దిగా వేయించిన పచ్చిమిరపకాయలతో గాని స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీతోగానీ సర్వ్ చేయాలి.
Read this post in English:
Tags:
పిల్లల కోసం,
స్నాక్స్
February 13th, 2010 at 5:22 pm
చలికాలంలో అన్నీ తాజా కూరగాయలు దొరుకుతాయి. లేతగా ఉండే కూరగాయలను చూస్తే ఎప్పుడెప్పుడు కొనేసి మంచి కూరలు చేసుకుందామా అనిపిస్తుంది. అందులో ముఖ్యమైనది బెండకాయ. లేత బెండకాయలను చూస్తే ఎవరికి మాత్రం వాటిని తీసికెళ్లి వేపుడో, పులుసో పెట్టుకుందామని ఉండదు. కాని ఎప్పుడూ అవేనా? కాస్త వెరయిటీగా చేద్దామని బెండకాయలతో కుర్మా చేద్దామని డిసైడ్ ఐపోయా. పదండి మరి ఎలా చేయాలో తెలుసుకుందాం

కావలసిన వస్తువులు :
బెండకాయలు – 1 kg
టమాట – 2
ఉల్లిపాయ – 1
పసుపు – 1/4 tsp
కారం పొడి – 1 tsp
ఉప్పు – తగినంత — 1/4 tsp
గరం మసాలా పొడి – 1/4 tsp
ధనియాల పొడి – 1 tbsp
అల్లం , వెల్లుల్లి పేస్ట్ – 1 tsp
కొబ్బరి పొడి – 2 tbsp
గసగసాలు – 1 tsp
పెరుగు – 1/4 కప్పు
కొత్తిమిర – 2 రెమ్మలు
కరివేపాకు – 1 రెమ్మ
నూనె – 3 tbsp
బెండకాయలను కడిగి , గుడ్డతో తుడిచి అంగుళం సైజులో ముక్కలు చేసుకోవాలి. టమాటాలు నాలుగు పక్షాలుగా కట్ చేసుకోవాలి. వెడల్పాటి ప్యాన్ లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి మెత్తబడేవరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ , కరివేపాకు, పసుపు వేసి మరి కొద్దిసేపు వేయించి బెండకాయ ముక్కలు వేసి మెల్లిగా కలుపుతూ వేయించాలి. మూత పెట్టకూడదు. దీనివల్ల ముక్కలు విరిగిపోవచ్చు. బంకగా అవుతాయి. పొడిపొడిగా ఉండాలంటే మూతపెట్టకుండా వేయించాలి. టమాట ముక్కలు, కారం, తగినంత ఉప్పు వేసి కలిపి రెండు నిమిషాలు వేగనివ్వాలి. గసగసాలు వేయించి కొబ్బరితో కలిపి కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లా రుబ్బుకోవాలి. ఇందులో పెరుగు కూడా వేసి కలపాలి. బెండకాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత ధనియాల పొడి,కొబ్బరి గసగసాల పేస్ట్ ఇందులో వేసి అరకప్పు నీరు పోసి కలిపి నిదానంగా సుమారు ఐదునిమిషాలు ఉడకనివ్వాలి. కూర దగ్గరపడ్డాక గరం మసాలా సన్నగా తరిగిన కొత్తిమిర వేసి దింపేయాలి. ఘుమఘుమలాడే బెండకాయ కుర్మా తయారైపోయింది. చాలా తొందరగానే స్పైసీ వంటకం తయారవుతుంది. అన్నంలోకి , రొట్టెలలోకి చాలా బావుంటుంది..
Read this post in English:
Tags:
బెండకాయ