ఓట్స్ ఆరోగ్యానికి మంచివి అని తెలుసుకున్నాం కదా. ఇవాళ ఓట్స్ తో కొన్ని కూరగాయలు కలిపి ఉప్మా చేసుకుందాం..
కావలసినవి :
ఓట్స్ – 1 కప్పు
కూరగాయలు – 1/2 కప్పు (బీన్స్, క్యారట్, బంగాళదుంప,క్యాప్సికమ్)
ఉల్లిపాయ – 1 చిన్నది
అల్లం – అంగుళం ముక్క
పచ్చిమిరపకాయలు – 2
కరివేపాకు – 2 రెబ్బలు
కొత్తిమిర – 2 చెంచాలు
ఉప్పు – తగినంత
ఆవాలు – 1/4 tsp
జీలకర్ర – 1/4 tsp
మినప్పప్పు – 1 tsp
శనగపప్పు – 1 tsp
వేరుశనగగుళ్లు – 2tsp
నూనె – tsp
నీళ్లు – 1 1/2 కప్పులు
కూరగాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. పెనం వేడి చేసి నూనె వేయకుండా ఓట్స్ ని నిదానంగా రంగు మారేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక మినప్పప్పు, శనగప్పప్పు, వేరుశనగపప్పు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం , కరివేపాకు వేసి కొద్దిగా వేయించాలి. తర్వాత కూరగాయ ముక్కలు కూడా వేసి చిన్నమంటపై అవి మెత్తబడేవరకు వేయించాలి. ఇప్పుడు నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి మూతపెట్టి మరగనివ్వాలి. మరుగుతున్న నీళ్లలో ఓట్స్ వేసి బాగా కలిపి మూతపెట్టి ఐదు నిమిషాలు నిదానంగా ఉడకనివ్వాలి. సన్నగా తరిగిన కొత్తిమిర కలిపి ఆవకాయ లేదా పెరుగు పచ్చడితో సర్వ్ చేయాలి. రుచికరమైన ఉప్మా రెడీ ..