అదేంటో ఈ మధ్య ఉల్లిపాయ మీద ప్రేమ ఎక్కువవుతుంది. కూరగాయలన్నింటి కంటే ఉల్లిపాయే చవగ్గా ఉంది మరి. కాదేది కవిత కనర్హం అన్నట్టు కాదే ఉల్లిపాయ కూరకనర్హం అని రంగంలోకి దిగాను. ఎప్పుడు కూరగాయలతోనే మసాలా కూరలు చేసుకోవాలా?ఉల్లిపాయతో కూడా మంచి గుత్తి కూర చేసి చూద్దాం అని ఈ ప్రయోగం చేసాను..ఎప్పటిలాగే హిట్..
కావలసిన వస్తువులు :
చిన్న ఉల్లిపాయలు – 8 – 10
పెద్ద ఉల్లిపాయ – 1
కొబ్బరి పొడి – 3 tbsp
జీలకర్ర పొడి – 1/2 tsp
మెంతి పొడి – 1/4 tsp
నువ్వుల పొడి – 1 tbsp
పల్లీల పొడి – 2 tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 tsp
చింతపండు పులుసు – 1/4 కప్పు
పసుపు – 1/4 tsp
కారం పొడి – 1 tsp
ఉప్పు – తగినంత
కరివేపాకు – ౨ రెబ్బలు
నూనె – 3 tbsp
పెద్ద ఉల్లిపాయను నీళ్ళలో వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు పులుసులో ఉల్లిపాయ ముద్దా, కొబ్బరి, జీలకర్ర, మెంతి, నువ్వులు, పల్లీల పొడులన్నీ వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇందులో పసుపు, కారం, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్దా వేసి కలపాలి. వెడల్పాటి ప్యాన్ లో నూనె వేడి చేసి పొట్టు తీసిన చిన్న ఉల్లిపాయలు (సాంబార్ ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ) , కరివేపాకు వేసి చిన్నమంటపై మగ్గనివ్వాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడ్డాక మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు ఇందులో వేసి కలిపి , అవసరమనుకుంటే అరకప్పు నీళ్ళు పోసి మూట పెట్టి చిన్న మంటపై నూనె తేలేవరకు ఉడకనివ్వాలి. పదినిమిషాల్లో తయారైపోతుంది. ఈ కూరను చపాతీలు, అన్నం, పలావ్ , బిర్యానిలకు కూడా బావుంటుంది.
9:32 pm on July 30th, 2010 1
చాలా చాలా బాగుంది
నేను అమెరికాలో ఉన్నాను.
మీ వెబ్ సైట్ చూసి వంటలు చేసుకుంతున్నాను
రమ్య
5:47 pm on July 31st, 2010 2
చాలా బాగుంది జోతి గారు