
తొండము నేకదంతమును దోరపు
బొప్జ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని
చూపులు మందహాసమున్
కొండొక గుజ్జురూపమున కోరిన
విద్యలకెల్ల నొజ్జవై
యుండెడి పార్వాతీతనయ యోయి
గణాధిప నీకు మ్రొక్కెదన్ !
ఈరోజు వినాయక చవితి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. బొజ్జగణపయ్యకు ఇష్టమైనవి కుడుములు, ఉండ్రాళ్లు మొదలైన వాటితోపాటు మరెన్నో ప్రసాదాలు చేసి సమర్పిస్తాము. ఇది ప్రాంతాలవారిగా వేరువేరుగా ఉంటుంది. ఎలా ఉన్నా చేరేది ఆ విఘ్నవినాయకుడికే కదా. వినాయకుడికి తప్పనిసరిగా చేసే తాలికల పాయసం గురించి తెలుసుకుందాం.

తాలికలంటే ఇప్పటి నూడుల్స్ లాంటివి. కొన్నేళ్ల క్రితం వరకు మంచి గోధుమలు మర పట్టించి ఇంట్లోనే తయారుచేసుకునే వారు. దీనికోసం ప్రత్యేకమైన మిషను ఉంటుంది .ఎండాకాలంలో వీటిని తయారు చేసుకుని బాగా ఎండబెట్టి సంవత్సరమంతా వాడుకునేవారు. ఇందులోనే జంతికలలాగా బిళ్లలు మార్చుకుని సన్నగా, లావుగా కూడా చేసుకోవచ్చు. మిగతావాటికి బజారులో దొరికే సేమ్యా, నూడుల్స్ కొనుక్కున్నా, వినాయక చవితికి మాత్రం ఇంట్లోనే చేసుకుంటాము. మిషన్ లేకున్నా గోధుమ పిండి చపాతీలకు మళ్లే తడుపుకుని చేత్తో చేసుకోవచ్చు. ఈ తాలికలు ముందే చేసి ఎండబెట్టి వాడుకోవచ్చు.లేదా అదే రోజు చేసుకుని పాయసం చేసుకోవచ్చు..

కావలసిన వస్తువులు :
తాలికలు -200 gms
బెల్లం – 250 gms
పాలు – 1/4 లీటర్
యాలకుల పొడి – 1 tsp
నెయ్యి – 5 tbsp
జీడిపప్పు, బాదాం -6 each
ముందుగా తాలికలు ఒకసారి నీళ్లతో కడిగి కుక్కర్లో రెండింతలు నీళ్లు పోసి , చెంచాడు నెయ్యి వేసి మరీ మెత్తగా కాకుండా ఉడికించాలి.. ఇందులో పాలు, తురిమిన బెల్లం వేసి ఉడికించాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి.. నెయ్యి, యాలకుల పొడి వేసి కలిపి దింపేయాలి. సన్నటి జీడిపప్పు, బాదాం ముక్కలు చల్లి నైవేద్యం సమర్పించాలి..
తెలంగాణా ప్రాంతంలో వినాయక చవితికి ఈ తాలికల పాయసం, తుమ్మికూర పచ్చడి, పులిహోర,ఉండ్రాళ్లు తప్పనిసరిగా ఉండాల్సిందే…
4:43 pm on August 23rd, 2009 1
మ్మ్. చూడటానికి బాగున్నాయి.