నాన్ వెజ్ తినాలనిపించింది. చికెన్ తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు అదే కాస్త చవకగా ఉంది. మటన్, చేపల ధరలు ఆకాశంలో ఉన్నాయి వానల్లాగా. కిందకు రానంటున్నాయి. చికెన్ ఏయే వంటకాలు చేయవచ్చు. వేపుడు, ఇగురు, పులుసు లేదా బిర్యాని. కాస్త వెరయిటీగా చికెన్ కీమాతో కట్లెట్ చేసుకుందాం.
చికెన్ కీమా -250 gms
ఉల్లిపాయ – 1
కొత్తిమిర – 1/4 కప్పు
పచ్చిమిరపకాయలు – 3
పసుపు – 1/4 tsp
కారం పొడి – 1 tsp
గరం మసాలా పొడి – 1/2 tsp
ఉప్పు – తగినంత
కార్న్ ఫ్లోర్ – 2 tsp
అల్లంవెల్లుల్లి ముద్ద – 1 tbsp
నూనె – వేయించడానికి..
ఒక గిన్నెలో చికెన్ కీమా, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమిర, పచ్చిమిరపకాయలు, పసుపు, కారంపొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి, కార్న్ ఫ్లోర్ వేసి మొత్తం బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని పదినిమిషాలు అలా వదిలేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మీకు ఇష్టమైన షేపులో (గుండ్రంగా, కోలగా, పొడుగ్గా ) చేసుకోవాలి. పెనం వేడి చేసి కొద్దిగా నూనె వేయాలి. తయారు చేసుకున్న కట్లెట్లను పెనంపై నిదానంగా బంగారురంగు వచ్చేవరకు రెండువైపులా వేయించుకోవాలి. అప్పుడప్పుడు కొద్దిగా నూనె వేయాలి. లేదా కడాయిలో నూనె వేసి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. షాలో ప్రై చేస్తే నూనె తక్కువ అవసరమవుతుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. మైక్రోవేవ్ లో కూడా చేసుకోవచ్చు. ఇంకా మంచిది. ఈ కట్లెట్లను కాస్త పలుచగా వత్తుకోవాలి. అప్పుడే లోపలివరకు ఉడుకుతుంది. రెండువైపులా కాల్చుకున్న కట్లెట్లను టమాట సాస్ తో సర్వ్ చేయండి. పిల్లలు ఈ కొత్త స్నాక్ ను చాలా ఇష్టపడతారు.



2:07 pm on June 30th, 2010 1
చాల బాగుంది
4:07 pm on July 23rd, 2010 2
madam i want how to prepare chicken curry, badusha and plain biryani